2nd డిబేట్‌లో పేలిన తూటాలు: మారిన మనిషిని, అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడు.


వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో భాగంగా హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో రెండో డిబేట్ ప్రారంభమైంది. ఈ డిబేట్‌లో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో హిల్లరీ వ్యక్తిగత జీవితంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 12 ఏళ్ల బాలికపై బిల్ క్లింటన్ అత్యాచారానికి పాల్పడ్డారని, అయినా హిల్లరీ నోరు మెదపలేదని ఆరోపించారు. బిల్ క్లింటన్ మహిళలకు చేసిన అన్యాయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గతేడాది ప్రభుత్వ విధానాల వల్లే ద్రవ్యలోటు అమాంతం పెరిగిందని ఒబామా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు కల్పించడంలో హిల్లరీ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం తాను మాట్లాడిన మాటలను తెరపైకి తేవడం మంచిది కాదన్నారు. మహిళలను తానెప్పుడూ అవమానించలేదని, మహిళలంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. తాను మారిన మనిషినని ట్రంప్ పేర్కొన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ సమాధానం చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే హిల్లరీ జైలు కెళ్లడం ఖాయమని అన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ మరోసారి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాను గెలిస్తే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారు. 39వేల ఈమెయిల్స్ లీకైనప్పటికీ తప్పు జరగలేదనడం హిల్లరీ పేర్కొనడం దారుణమని ట్రంప్ అన్నారు. తనని క్షమాపణలు అడిగే హక్కు హిల్లరీకి లేదన్నారు. తనకు రష్యాతో గానీ, పుతిన్ గానీ ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ మహిళలను ట్రంప్ తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న గౌరవాన్ని బయటపెట్టాయని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడు కాదనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ ఉండదన్నారు. ట్రంప్ వ్యక్తిత్వమెంటో ఆడియోల్లో బయటపడిందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి అమెరికా ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ దారుణమైన వ్యాఖ్యలు చేశారని హిల్లరీ అన్నారు. ట్రంప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. అమెరికన్లు ఇస్లాంతో యుద్ధం చేయడం లేదన్నారు.
ఈ మెయిల్స్ లీక్‌లో తన తప్పు ఉందని, అందుకు గాను గతంలోనే తాను క్షమాపణలు చెప్పానని హిల్లరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను అమెరికా ప్రజలందరి తరుపున ప్రెసిడెంట్‌గా పనిచేస్తానని తెలిపారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానని అన్నారు. అమెరికా సైనికుల త్యాగాలను ట్రంప్ కించపరచడం తగదని అన్నారు. పుతిన్‌తో ఎలాంటి సంబంధాలు లేకపోతే ట్రంప్‌ను ఎందుకు సమర్ధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మొదటి డిబేట్‌లో హిల్లరీదే పైచేయి: మొదటి డిబేట్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ పైచేయి సాధించిన నేపథ్యంలో రెండో డిబేట్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. హిల్లరీ సీక్రెట్ ఈమెయిల్స్, కన్న కూతురిపై ట్రంప్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో జరగుతునున్న ఈ డిబేట్ ఆసక్తి రేపుతోంది. ఈ డిబేట్‌కు మోడరేటర్‌గా సీఎన్ఎన్ ప్రతినిధి ఆండ్రూసన్ కూపర్ వ్యవహరించారు. ఈ డిబేట్‌లో నిర్దిష్టమైన అంశం అంటూ ఏమీ లేదు. దీనిని రెండు భాగాలుగా విభజించారు. గతంలో టౌన్‌హాల్ జరిగిన డిబేట్ మాదిరే తరహాలో సాగనుంది. మొదటి భాగంలో ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు ట్రంప్, హిల్లరీలు సమాధానం చెబుతారు. తర్వాతి భాగంలో మోడరేటర్ ప్రశ్నలు సంధిస్తారు.



No comments