సర్వ శక్తిమంతుడు.. చైనా అధ్యక్షుడు... బలోపేతం చేసేందుకు పార్టీ నిబంధనలకు సవరణలు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ‘మరో మావో’ను చేయాలన్న లక్ష్యంతో అధికార కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఆ పార్టీ ఆరో ప్లీనరీ సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మరింత శక్తిమంతున్ని చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ కేంద్ర కమిటీకి చెందిన సుమారు 370 మంది శాశ్వత, ప్రత్యామ్నాయ సభ్యులు హాజరుకానున్నారు. కఠిన క్రమశిక్షణాయుత పార్టీ నిర్వహణ, అంతర్‌ పార్టీ పర్యవేక్షణ, పార్టీలో రాజకీయ జీవితం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని ప్రభుత్వ ఆధీనంలోని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. జిన్‌పింగ్‌ అధ్యక్షతన ఉన్న ఏడుగురు సభ్యుల స్థాయీ సంఘమే వాస్తవానికి దేశాన్ని పాలిస్తుంది. అందులో జిన్‌పింగ్‌, మరొకరు మినహా మిగిలిన అయిదుగురు సభ్యుల వయసు 68 ఏళ్లు నిండుతుంది. వారిని కొనసాగించాలంటే పార్టీ నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. లేదంటే వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. జిన్‌పింగ్‌కు 63 ఏళ్లు వచ్చినప్పటికీ, అధ్యక్షునికి పదేళ్ల కాలపరిమితి ఉండాలన్న నిబంధన మేరకు ఆయన 2022 వరకు కొనసాగనున్నారు. ఆయనను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ‘ఉమ్మడి నాయకత్వ’ నిబంధనను సవరించాలని, 2022 తరువాత కూడా ఆయనను కొసాగించాలని ప్రతిపాదించారు.1980 నాటి నిబంధనలను సవరించనున్నారు. హాంగ్‌కాంగ్‌లో వచ్చే ఏడాది పార్టీ కాంగ్రెస్‌ జరగనున్న దృష్ట్యా ముందుగానే ఈ విషయాలపై స్పష్టత వచ్చేలా ప్రస్తుత సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న ప్రసుత తరుణంలో జిన్‌పింగ్‌లాంటి గట్టి నాయకుడు అవసరమని పార్టీ వర్గాలు అభిప్రాపడుతున్నాయి.
అవినీతిపై కఠిన చర్యలు: అవినీతిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు పార్టీ క్రమశిక్షణ, పర్యవేక్షణ
సంఘం తెలిపింది. 2013 నుంచి గత నెల వరకు అవినీతికి పాల్పడ్డ దాదాపు పది లక్షల మంది అధికారులపై చర్యలు తీసుకున్నట్టు నివేదిక వెలువరించింది. జిన్‌పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యలు ఆయనకు ప్రజల్లో మంచిపేరు తీసుకురావడమే కాకుండా, పార్టీలోని ఆయన వ్యతిరేకులకు ముకుతాడు వేసేలా చేసింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు పొందడం రాజకీయంగా ప్రాధాన్యంగల అంశమని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

Unknown Tuesday, 25 October 2016