10 సంప‌న్న న‌గ‌రాల్లో రెండు తెలుగు న‌గ‌రాలు.

అంత‌ర్జాతీయంగా భార‌త్ పేరు రోజురోజుకీ విస్త‌రిస్తోంది. జ‌నాభాలో రెండో అతిపెద్ద దేశ‌మైన ఇండియా ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా పెరుగుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ నేప‌థ్యంలో జీడీపీ ప‌రంగా దేశంలో 10 ప్ర‌ముఖ న‌గ‌రాల‌ను తెలుసుకుందాం. హెల్లోట్రావెల్ వెల్ల‌డించిన ఈ ప‌ది న‌గ‌రాల వివ‌రాలు ఇక్క‌డ చూడండి.

ముంబయి

దేశ ఆర్థిక రాజ‌ధానిగా వెలుగొందుతున్న ముంబ‌యి అత్య‌ధిక ధ‌నిక న‌గ‌రం. మ‌హారాష్ట్ర రాజధాని అయిన‌టువంటి ఈ న‌గ‌రం ప్ర‌పంచంలోనే రెండో అత్యంత జ‌న స‌మ్మ‌ర్థం క‌లిగిన న‌గ‌రం. దీని ప్ర‌స్తుత జ‌నాభా 1 కోటి 30 ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగాల్లో 10 శాతం ఈ న‌గ‌రం నుంచే ల‌భిస్తున్నాయి. దేశానికి ఎగుమ‌తి ప‌న్ను 20 శాతం ఇక్క‌డ నుంచే వ‌స్తోంది. ముంబై న‌గ‌ర త‌ల‌స‌రి ఆదాయం దాదాపు రూ. 49 వేలు.
ఇది జాతీయ త‌ల‌స‌రి ఆదాయం కంటే మూడింత‌లు ఎక్కువ‌. ప్ర‌ముఖ స్టాక్ ఎక్స్చేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్‌బీఐ ప్ర‌ధాన కార్యాలయాలు ఇక్క‌డే ఉన్నాయి. ఈ న‌గ‌ర డీజీపీ 209 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని అంచ‌నా.

ఢిల్లీ

భార‌త‌దేశ రాజ‌ధాని ఢిల్లీ. ఆర్థికంగా సంప‌న్న‌మైన న‌గ‌రాల్లో ఢిల్లీ ఒక‌టి. ఢిల్లీ నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిటొరీ ప్రాంతంలో ఉన్న కార్లు మ‌రే న‌గ‌రంలో ఉన్న కార్ల కంటే ఎక్కువ‌. ఈ న‌గ‌ర జీడీపీ 167 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చు. రిటైల్ మార్కెట్‌లో ఎంతో ప‌ట్టుగ‌లిగిన ఈ ప్రాంతం ఎక్కువ ఎఫ్‌డీఐల‌ను ఆక‌ర్షిస్తోంది. దిల్లీ జీడీపీలో సింహ భాగం సేవా రంగం నుంచే వ‌స్తోంది. ఇత‌ర ముఖ్య రంగాలు ఐటీ, హోట‌ళ్లు, బ్యాంకింగ్‌, మీడియా, ప‌ర్యాట‌కం. ఎస్ అండ్ పీ సీఎన్ఎక్స్ 500 సూచీలోని వాణిజ్య సంస్థ‌ల‌లో 12% సంస్థ‌ల ప్ర‌ధాన కార్యాల‌యాలు ఢిల్లీ న‌గ‌రంలో ఉన్నాయి.

కోల్‌క‌త‌

ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని అయినటువంటి కోల్‌క‌త‌కు ఎంతో చారిత్ర‌క ప్రాధాన్యం ఉంది. ఈ నగ‌రం జీడీపీ 150 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. పోర్టు చాలా ప్రాముఖ్యం క‌లిగి ఉండి, ఈశాన్య ప్రాంతానికి వాణిజ్య హ‌బ్‌గా ఉంది. ఈ న‌గ‌ర జ‌నాభా 50 ల‌క్ష‌ల పైబ‌డే. తూర్పు భార‌త‌దేశంలో అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యం క‌లిగిన ఏకైక న‌గ‌రం కోల్‌క‌త‌. ఉక్కు, భారీ ఇంజినీరింగ్‌, గ‌నులు, ఖ‌నిజాలు, సిమెంట్, ఔష‌ధాలు, ఆహార త‌యారీ, వ్య‌వ‌సాయం, విద్యుత్ ప‌రిక‌రాలు, వ‌స్త్రాలు, జ‌నుము వంటి ప‌లు రంగాల‌కు, వ‌స్తువుల‌కు ఈ న‌గ‌రం ప్రాముఖ్య‌త గాంచింది. ఎన్నో బ‌హుళ జాతి కంపెనీల ప్ర‌ధాన కార్యాల‌యాలు కోల్‌క‌త‌లో ఉన్నాయి. ఇక్క‌డ ఐటీ రంగం 70 శాతం రేటుతో వృద్దిచెందుతుండ‌గా, ఎన్నో సెజ్‌ల విస్త‌ర‌ణ జ‌రుగుతోంది.

బెంగ‌ళూరు

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధానిగా ఉన్న‌టువంటి బెంగుళూరు న‌గ‌రం సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి చెందింది. 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఐటీ కంపెనీలు బెంగుళూరును అనువైన కేంద్రంగా ఎంచుకోసాగాయి. ఈ న‌గ‌ర జీడీపీ 83 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గ‌ల‌దు. వ్య‌వ‌స్థాప‌కులు ఎంచుకునే న‌గ‌రాల్లో ప్ర‌పంచంలో తొలి ప‌ది స్థానాల్లో బెంగుళూరు స్థానం సంపాదించింది. దేశం నుంచి విదేశాల‌కు వెళ్లే ఎక్కువ శాతం ఐటీ ఇంజినీర్లు ఇక్క‌డి నుంచే వెళుతున్నారంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ న‌గ‌రం ప్ర‌ఖ్యాతిని అర్థం చేసుకోవ‌చ్చు.

హైద‌రాబాద్‌

ముత్యాల న‌గ‌రంగా ప్ర‌సిద్ది చెందిన హైద‌రాబాద్ న‌గ‌ర జీడీపీ దాదాపు 74 బిలియ‌న్ డాల‌ర్లు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద చ‌ల‌న చిత్ర నిర్మాణ కేంద్ర‌మైన రామోజీ ఫిలిం సిటీ ఇక్క‌డే ఉంది. 1990 ద‌శ‌కం త‌ర్వాత హైద‌ర‌బాద్‌లో ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు ఇబ్బడిముబ్బ‌డిగా పెరిగాయి. బెంగుళూరు త‌ర్వాత హైద‌రాబాద్‌ను రెండో సిలికాన్ వ్యాలీగా అక్క‌డి ప్ర‌జ‌లు పిలుచుకుంటారు. ప‌ర్యాట‌క ప్ర‌పంచంలో హైద‌రాబాద్ న‌గ‌రానికి లోన్‌లీ ప్లానెట్ సంస్థ మూడో ర్యాంకును కేటాయించింది. ఈ న‌గ‌రంలో గూగుల్; అమెజాన్‌, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్ సంస్థ‌లు ఉన్నాయి. ప్ర‌పంచంలో ప్ర‌సిద్ది చెందిన ఫార్మా కంపెనీల ప్ర‌ధాన కార్యాల‌యాల‌తో విరాజిల్లుతూ జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతికెక్కింది.

చెన్నై

త‌మిళ‌నాడు రాజ‌ధాని అయిన చెన్నై న‌గ‌రం ద‌క్షిణ భార‌త‌దేశంలో ముఖ్య‌మైన పోర్టును క‌లిగి ఉంది.ఈ న‌గ‌ర జీడీపీ 66 బిలియ‌న్ డాల‌ర్లుచెన్నై న‌గ‌రం ఆటోమొబైల్; సాఫ్ట్‌వేర్ సేవ‌లు, మెడిక‌ల్ టూరిజం, హార్డ్‌వేర్ త‌యారీ రంగం, ఆర్థిక సేవ‌ల వంటి వాటిలో ముందంజ‌లో ఉంది.ఐటీ అనుబంధ సేవ‌ల ఎగుమ‌తుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది.దేశ ఎల‌క్ట్రానిక్ ఎగుమ‌తుల్లో స‌గ భాగం ఇక్క‌డ నుంచే అవుతున్నాయి.ఆటోమొబైల్ కంపెనీలు ఫోర్డ్‌; నిస్సాన్‌; బీఎండ‌బ్ల్యూ వంటి సంస్థ‌ల ప్ర‌ధాన కార్యాల‌యాలు ఇక్క‌డే ఉన్నాయి. అందుకే ఈ న‌గ‌రాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అంటారు.

అహ్మ‌దాబాద్‌

గుజ‌రాత్ రాష్ట్రంలో ఒక ముఖ్య న‌గ‌ర‌మైన అహ్మ‌దాబాద్ దేశంలో సంప‌ద విల‌సిల్లుతున్న న‌గ‌రాల్లో ఒక‌టి. ఇది ఏడో స్థానంలో ఉంటూ 64 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీతో ఉంది. అదానీ గ్రూప్‌; నిర్మా, అర్వింద్ మిల్స్‌, క్యాడిలా, టొరెంట్ ఫార్మాస్యుటిక‌ల్ష్ వంటి ప్ర‌ధాన సంస్థ‌లు ఇక్క‌డ ఉన్నాయి.ఎన్నో అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు అహ్మ‌దాబాద్ నిల‌యం. ప్ర‌ముఖ యాడ్ ఏజెన్సీ ముద్రా ఇక్క‌డి నుంచే ఆవిర్బ‌వించింది.జెమ్స్‌, జ్యువెల‌రీ ఎగుమ‌తులు దేశంలోనే అత్య‌ధికంగా ఇక్క‌డి నుంచే ఎగుమ‌తమ‌వుతుంటాయి.న‌రేంద్ర మోదీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప‌శ్చిమ భార‌త‌దేశంలో ఒక ఆర్థిక కేంద్రంగా త‌యార‌యింది.

పుణె

మ‌హారాష్ట్రలో రెండో అతిపెద్ద మెట్రోపాలిట‌న్ న‌గ‌ర‌మైన పుణె జీడీపీ 48 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.గ‌త ద‌శాబ్ద కాలంగా చాలా ఆటోమొబైల్ కంపెనీలు, ఐటీ సంస్థ‌లు పుణెను కేంద్రంగా ఎంచుకుంటున్నాయి.ఆహార‌, కూర‌గాయాల ప్రాసెసింగ్ యూనిట్ల‌ను నెల‌కొల్ప‌డం ద్వారా పుణె ఫుడ్ క్ల‌స్ట‌ర్‌ను త‌యారుచేసేందుకు ప్ర‌పంచ‌బ్యాంకు పెట్టుబ‌డులు పెడుతోంది.250 పైగా జ‌ర్మ‌నీ కంపెనీలు పుణెలో త‌మ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకున్నాయి.

సూర‌త్‌

సూర‌త్ న‌గర జీడీపీ 40 బిలియ‌న్ డాల‌ర్లు 2020 క‌ల్లా 57 బిలియ‌న్ డాల‌ర్ల‌ను చేరుకోగ‌ల‌ద‌ని ఆ న‌గ‌ర మేయ‌ర్ అంచ‌నా.ప్ర‌పంచ డైమండ్ హ‌బ్ అని సూర‌త్‌కు పేరు ప్ర‌పంచంలో క‌ఠిన‌మైన డైమండ్ల‌లో 90 శాతం ఇక్క‌డే క‌టింగ్‌కు వ‌స్తాయి. పాలిషింగ్ త‌ర్వాత ఎగుమ‌తి అవుతాయి. టెక్స్‌టైల్స్‌కు ఎంతో ప్ర‌సిద్ది పొందిన ఈ న‌గ‌రం 380కి పైగా డైయింగ్‌, ప్రింటింగ్ మిల్స్‌ను క‌లిగి ఉంది. 40 వేల‌కు పైగా ప‌వ‌ర్‌లూమ్స్ ఉన్నాయి
2001 నుంచి 10 సంవ‌త్స‌రాల‌లో ఈ న‌గ‌ర జ‌నాభా రెండింత‌ల‌యింది.

విశాఖ ప‌ట్నం

వైజాగ్‌గా అంద‌రి నోట ప్ర‌సిద్ది పొందిన విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర జీడీపీ 26 బిలియ‌న్ డాల‌ర్లు దేశంలోనే పురాత‌న షిప్‌యార్డ్ ఉంది. పోర్ట్ నుంచి చాలా ఎగుమ‌తులు అవుతాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అతి పెద్ద న‌గ‌రం విశాఖ ప‌ట్న‌మే. ఇక్క‌డ గెయిల్‌, విశాఖ ఉక్కు, హిందూస్తాన్ పెట్రోలియం చ‌మురు శుద్ది క‌ర్మాగారం ఉన్నాయి. ఐటీ రంగం కూడా ఇక్క‌డ రెండో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ది కొర‌కు విశాఖ‌ప‌ట్నంలో ఒక ప్ర‌త్యేక ఆర్థిక జోన్‌ను ప్ర‌భుత్వం నెల‌కొల్పింది.

No comments