వాషింగ్టన్: ఇప్పుడు తాను ఎంతో బాగున్నానని, తన స్వల్ప అస్వస్థత పెద్ద విషయమేమీ కాదని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తెలిపారు. 9/11 దాడులు జరిగి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో హిల్లరీ క్లింటన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.
'ఇది పెద్ద విషయం కాబోదని నేను భావిస్తున్నా. తీరిక లేకుండా చురుగ్గా పనిచేసే ప్రతి వ్యక్తికి ఇలాంటి స్వల్ప అస్వస్థతలు ఎదురవుతూ ఉంటాయి' అని క్లింటన్ తెలిపారు. అస్వస్థత నుంచి తేరుకున్న తర్వాత తొలిసారి సీఎన్ఎన్ చానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. తన 40 ఏళ్ల జీవితం గురించి, తాను చెల్లించిన పన్నుల గురించి, తన ఈమెయిల్స్ గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి సమగ్ర సమాచారం ప్రజలకు తెలుసునని ఆమె చెప్పుకొచ్చారు. న్యూమోనియోతో బాధపడుతున్న తాను వైద్యుడి సలహా పాటించకుండా బిజీ షెడ్యూల్ లో తలమునకలవ్వడం వల్లే స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. కొంచెం విశ్రాంతి తీసుకోవడం ద్వారా తాను తిరిగి పూర్తిస్థాయిలో షెడ్యూల్ ప్రకారం ముందుకెళతానని ఆమె చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ తమ ఆరోగ్య పరిస్థితిపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 68 ఏళ్ల హిల్లరీ అనారోగ్యానికి గురికావడం అమెరికన్లను ఆందోళనకు గురిచేసింది.
No comments