సెప్టెంబర్ 14న సింగూర్ దినోత్సవం, 9117 మంది రైతులకు భూ పట్టాలు పంపిణీ..

కోల్‌కతా: సుప్రీం కోర్టు ఆదేశాలను పొల్లుపోకుండా పాటిస్తామని, సింగూర్ బాధితులకు భూములు తిరిగి పంపిణీ చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం అన్నారు. సెప్టెంబర్ 14న సింగూర్ దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆ రోజు 9117 మంది రైతులకు భూ పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మమతా బెనర్జీ వివరించారు. పరిహారం కింద గత ప్రభుత్వం మంజూరు చేసిన 800 చెక్కులను కూడా అందజేస్తామన్నారు. ఆ భూముల్లో తిరిగి పంటలు పండించేలా చేస్తామన్నారు.
సింగూరు భూముల సేకరణ ప్రజా ప్రయోజనం కోదని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు, 12 వారాల్లో బాధితులకు అప్పగించాలని ఆగస్ట్ 31న టాటా సంస్థను ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ భూముల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను రెండు, మూడు రోజుల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థకు తెలిపింది. స్పందించని పక్షంలో ప్రభుత్వమే వాటిని తొలగిస్తుందని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. కేవలం కోర్టు ఆదేశాలను మాత్రమే తాము పాటిస్తున్నామని, ఆ సంస్థతో తమకు ఎలాంటి వైరం లేదని ఆమె స్పష్టం చేశారు.

No comments