వాషింగ్టన్, సెప్టెంబర్ 10:
అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలను ఆవిష్కరించాలనుకుంటున్న అమెరికాకు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) మరో సాహసయాత్రకు సంకల్పించింది. తాజాగా గురువారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఒక ఆస్టరాయిడ్‌పైకి రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపిన సంస్థ.. అనుమతి లభిస్తే మరో మిషన్‌కు సిద్ధంగా ఉంది. ఒక గ్రహశకలం పైనుంచి కారు సైజులో ఉండే రాయిని సేకరించి దానిని చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టాలనుకుంటున్నది. దీనిపై అమెరికా తదుపరి అధ్యక్షుడు, కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి యంత్రాలను కాకుండా వ్యోమగాముల సహాయంతో గ్రహ శకలాలను అధ్యయనం చేయాలనేది ఆరేండ్ల కిందట అధ్యక్షుడు ఒబామా వ్యక్తం చేసిన ఆకాంక్ష. అప్పుడాయన అంతరిక్ష పరిశోధనలపై తన కొత్త ప్రణాళికను వివరించేందుకు కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు వెళ్లారు. వ్యోమగాములు గురు గ్రహంపై దిగాలనేది తన కోరికని, ఇందుకోసం చేపట్టే తొలి చర్యల్లో వ్యోమగాములను చంద్రుడిపైకి కాకుండా ఇతరత్రా పంపాలని ఆయన సూచించారు. చరిత్రలో తొలిసారిగా మనం ఆస్ట్రోనాట్స్‌ను ఆస్టరాయిడ్ పైకి పంపడాన్ని ప్రారంభిద్దాం అని ఆయన చెప్పారు. 2030 దశకం మధ్యకాలానికల్లా మనం మనుషులను గురుకక్ష్యలోకి పంపి, తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురాగలుగుతామని విశ్వసిస్తున్నాను. ఆ తర్వాత గురుగ్రహంపైకి దిగడం ప్రారంభమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. అయితే మనుషులను గ్రహశకలంపైకి పంపి తిరిగి తీసుకురావడం చాలా కష్టమైన పని అని నాసా శాస్త్రవేత్తలు భావించారు. అందుకు దీర్ఘ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. దాంతో ప్రత్యామ్నాయ నమూనాను ఎంచుకున్నారు. మనుషులను ఆస్టరాయిడ్‌పైకి పంపే బదులు అక్కడి ఓ పెద్ద రాయిని మనుషుల దగ్గరకు తీసుకొచ్చే ప్రక్రియ ఇదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలుత ఆస్టరాయిడ్ పైనుంచి పెద్ద సైజు రాయిని భూమిపైకి తీసుకొస్తారు. ఆ తర్వాత దానిని చందుడి కక్ష్యలోకి ప్రవేశపెడుతామని స్పేస్ పాలసీ అనలిస్టు, కన్సల్టెంట్ అయిన మార్సియా స్మిత్ తెలిపారు.
No comments