కళ్లు తెరిచిన జయ: తనకేమైందంటూ సైగలతో ప్రశ్న!


చెన్నై: గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆమె కోసం తపన పడుతున్న అందరినీ సంతోషానికి గురిచేశారు. అస్వస్థత కారణంగా 18 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న జయలలిత ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అన్నాడీఎంకే సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డాక్టర్‌ శివకుమార్‌ నేతృత్వంలోని అపోలో వైద్యబృందం, లండన వైద్యుడు డాక్టర్‌ జాన రిచర్డ్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఇచ్చిన చికిత్సతో ఆమె కోలుకుంటున్నారని తెలిపాయి. వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న జయ.. ఆదివారం మధ్యాహ్నం కళ్లు తెరవడంతో పాటు మెల్లిగా వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం. అంతేగాక, వైద్యులను తనకేమైందంటూ సైగలతో జయలలిత ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వార్త మంత్రులకు అన్నాడీఎంకే కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దీంతో పదిరోజుల తర్వాత పార్టీ వర్గాల్లో కొంత ఉత్సాహం కనిపించింది. కాగా, జయకు రక్తపోటు, చక్కెర శాతం సాధారణ స్థితికి వచ్చాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ఆమెను ఇంటికి పంపించే అవకాశముందని అపోలో వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. అమ్మ త్వరలోనే తిరిగివస్తోందంటూ ఆనందపడిపోయారు.ఇది ఇలా ఉండగా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, సీపీఐ జాతీయ నేత డి.రాజా, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన తదితరులు అన్నాడీఎంకే సీనియర్‌ మంత్రులు, వైద్యులతో మాట్లాడి జయ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. జయలలిత చికిత్స స్పందిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలోనే ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తారని చెప్పారు. కాగా, జయలలిత త్వరగా కోలుకోవాలంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. కాగా, ఆపద్ధర్మంగా ఉపముఖ్యమంత్రిని నియమించాలన్న ఆలోచనపై అన్నాడీఎంకే ఒక నిర్ణయానికి వచ్చింది. పరిపాలనాపరమైన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నందున డిప్యూటీ సీఎం అవసరం లేదని ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది.




No comments