ఐఫోన్ నుంచి అగ్గిపెట్టె వరకు.. వైట్‌హౌస్ బిల్డింగ్ నుంచి వాటర్ బాటిల్ వరకు దేనికైనా ప్రతిరూపాన్ని సృష్టించగల దేశం చైనా. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కట్టడాలకు ప్రతిసృష్టి చేసిందని అందరికీ తెలుసు. కానీ కట్టడాలకే కాదు ఏకంగా ప్రముఖ సుందర నగరం పారిస్‌కు సైతం ప్రతిసృష్టి చేసిందని తెలుసా? అవును.. పారిస్‌లాంటి అద్భుత నగరాన్ని తమ దేశస్థులకు అందించాలని భావించి పారిస్‌లాగే ఒక నగరాన్ని నిర్మించింది చైనా. అయితే.. అది పాపులర్ కాకపోగా నిర్మానుష్య ప్రాంతంగా మారిపోయింది.
చైనాలోని టియాండుచెంగ్ ప్రాంతంలో సంపన్నుల కోసం పారిస్‌లో ఉన్న భావన కలిగేలా అలాంటి కమ్యూనిటీ నగరాన్ని నిర్మించాలని చైనా ప్రభుత్వం భావించింది. 2007లో ప్రారంభించిన పారిస్ నగర నిర్మాణంలో భాగంగా పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌ను ఇక్కడ కూడా 354అడుగుల ఎత్తులో నిర్మించారు. అదే కాదు.. పారిస్‌లోని ఇతర ప్రముఖ కట్టడాలు.. భవనాలు.. పార్కులు.. రోడ్లు అన్నీ పారిస్‌ని పోలినట్లుగా నిర్మించారు. దీంతో ఇది పారిస్ నగరానికి డూప్లికేట్‌గా మారిపోయింది. లక్ష మంది నివసించేందుకు వీలుగా భవనాలు నిర్మించారు. కానీ.. ఎందుకోగానీ ఈ ప్రాంతానికి దెయ్యాల నగరంగా పేరు వచ్చింది.
దీంతో ఎవరూ ఇక్కడి ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో నగరమంతా నిర్మానుష్యంగా మారింది. అయితే ఈ నగరానికి దగ్గర్లో ఉన్న ఓ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు మాత్రం ఇక్కడ ఉంటున్నారు. వారి జనాభా కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం చైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరోసారి అభివృద్ధి చేసి అందరిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
No comments